Recent Posts

ఇళ్ల నిర్మాణలో సెప్టెంబర్ 15 నాటికి స్లాబ్ వరకు పనులు పూర్తి కావాలి-కలెక్టర్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణ పథకానికి సంబంధించి జిల్లాలో నమోదు అయిన 39 వేల గృహాలకు రానున్నవర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 15 నాటికి స్లాబ్ వరకు పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.వి.యన్.చక్రధర బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.     శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన ప్రాంగణంలో హౌసింగ్,వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు వారివారి గృహాలలో చేరేంతవరకు,విధులు కేటాయించిన స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారులందరూ స్వయం సహాయక గ్రూపు లో నమోదు చేసుకొని ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా స్వయం సహాయక గ్రూపులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని లబ్ధిదారులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందించేలా చూడవలసిన అవసరం ఉందన్నారు. ఇంకనూ మౌలిక వసతులు ఏర్పాటు చేయని లేఅవుట్లలో త్వరితగతిన అవసరమైన విద్యుత్తు,నీరు వంటి మౌలిక వసతులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లబ్ధిదారుల్లో అవగాహన పెంచవలసిన అవసరం ఉందన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుక తరలింపు విషయంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండే విధంగా SEB అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అవసరమైన ఇసుక, సిమెంటు ఇతర ముడి సామాగ్రిని ముందస్తుగా అందుబాటులో వుంచుకోవాలన్నారు.ప్రతి వారం గృహ నిర్మాణాలలో ప్రగతి కనపడాలని స్పష్టం చేశారు. ఆఫ్ లైన్ లో ఉన్న దరఖాస్తులను ఆన్లైన్లోకి మార్చాలని ఆయన సూచించారు. చెల్లించవలసిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచడం ద్వారా త్వరితగతిన బిల్లుల చెల్లింపులు CFMS ద్వారా జరుగుతుందని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్( హౌసింగ్) విదేహ్ ఖరే, అధికారులు పాల్గొన్నారు..

Spread the love