కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-నలుగురు మృతి
అమరావతి: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వలచెరువు ఘాట్లో ప్రమాదకరమైన మలుపు వద్ద కారుపైకి దూసుకొచ్చిన అధికలోడు లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
నుజ్జునుజ్జు అయిన కారు:- బెంగళూరు నుంచి కడప జిల్లా బద్వేలు ప్రాంతానికి ఓ ఫంక్షన్లో పాల్గొనడానికి వస్తున్న కుటుంబం ప్రమాదానికి గురైంది. గువ్వలచెరువు ఘాట్లో ప్రమాదకరమైన నాలుగో మలుపు వద్ద రాయచోటి వైపు నుంచి వస్తున్న కారు మలుపు తీసుకుని కిందికి దిగే క్రమంలో వెనక నుంచి వస్తున్న అధికలోడు లారీ ఢీకొట్టింది. మలుపు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేని లారీ డ్రైవర్, ముందు వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లాడు. దీంతో కారుపైన అధికలోడు ఉన్న లారీ నిలబడి పోయింది. కారంతా నుజ్జునుజ్జు అయ్యింది.
అతికష్టం మీద బయటికి తీశారు:- కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారిలో భార్యాభర్తలు శ్రీకాంత్ రెడ్డి(34), శిరీష(32)తోపాటు కుమార్తె శీర్షిక(10), మరో మహిళ హర్షిణి ఉన్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి, బద్వేలు మండలం చిన్నపుస్తాయపల్లెలో పోలేరమ్మ జాతరలో పాల్గొనడానికి వస్తున్న సందర్భంగా ఘాట్లో ప్రమాదం సంభవించి కుటుంబం మృత్యువాత పడింది. కారుపైన అధికలోడు ఉన్న లారీ ఉండటంతో వాటిని తొలగించడానికి రెండు గంటల సమయం పట్టింది. కారులో ఉన్న మృతదేహాలను అతికష్టం మీద బయటికి తీశారు. లారీ డ్రైవర్ కూడా గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.