ఏడాది పాలనలో ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు-వైయస్ జగన్
నిజానికి చంద్రబాబునే ఇప్పుడు అరెస్టు చేయాలి..
అమరావతి: ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. ఏడాది గడుస్తున్నా ఒక్క పథకం అమలు చేయకపోగా, ఇంత తక్కువ వ్యవధిలోనే దాదాపు లక్ష 40 వేల కోట్ల అప్పులు చేశారని, ఇదే సమయంలో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందని, ఆదాయమంతా.. చంద్రబాబు, ఆయన తోడు గజదొంగల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు..గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు..
రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై నాణ్యానికి రెండోవైపున ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మన యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదు. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా యుధ్ధం చేస్తున్నాం.
వి.విజయసాయిరెడ్డి:- విజయసాయిరెడ్డి. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరాలు టర్మ్ ఉండగా, చంద్రబాబు నాయుడు కూటమికి మేలు చేసేందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్లీ రాజ్యసభకు వైసీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్మ్ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్స్‌కు ఏం విలువ ఉంటుంది?. అటువైపు నుంచి మనం కూడా ఎవర్ని అయినా తీసుకుని ఇదే మాదిరిగా చెప్పిస్తే వ్యాల్యూ ఉంటుందా?
ఈ బ్రాండ్లు ఎప్పుడైనా చూశామా?:– ఇప్పడు చంద్రబాబు అమ్ముతున్న బ్రాండ్లు ఏమిటి? ఈ బ్రాండ్ల ఫొటోలు ఎప్పుడన్నా చూశారా? సుమో అంట.. కేరళా మాల్ట్ అంట ఎప్పుడన్నా చూశారా? షార్ట్ విస్కీ అంట ఎప్పుడన్నా చూశారా? బెంగళూరు విస్కీ అంట ఎప్పుడన్నా చూశారా? బావుండదని, పక్కన మళ్లీ బెంగళూరు బ్రాందీ.. రాయల్ ల్యాన్సర్ విస్కీ అంట ఎప్పుడన్నా విన్నారా? ఓల్డ్ క్లబ్ అంట ఎప్పుడన్నా చూశారా? గుడ్ ఫ్రెండ్స్ అంట.. ఎప్పడన్నా విన్నారా? నేను ఒక్కటే అడుగుతా ఉన్నా..
ధరలు తగ్గిస్తానని చెప్పి:- తానొస్తే ధరలు తగ్గిస్తామన్నాడు.. తగ్గించింది లేదు కానీ. తీరా షాపులు తన మాఫియా చేతుల్లో పెట్టిన తర్వాత.. ప్రాసెస్ అంతా పూర్తయ్యాక వారికిచ్చే కమీషన్ పెంచాడు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. ఇక్కడ విలేకరులు ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్లండి ఎక్కడన్నా ఎమ్మార్పీకి అమ్ముతున్నారా అని ఎంక్వైరీ చేయండి. ఇది స్కాం కాదా? హిస్టరీ ఆఫ్ ఏపీలో ఎప్పుడూ జరగలేదు.
జూన్ 4న ‘వెన్నుపోటు’ దినం:– చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమయ్యాయని ప్రశ్నిస్తూ 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక, అన్యాయాలపై గళమెత్తుతూ వచ్చే నెల 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నాం. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ప్రజలతో కలిసి, ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగుల్ని మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే కార్యక్రమం నిర్వహిస్తాం. ఇందులో అందరూ పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు.