తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం-నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
తిరుమల: తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలు నిషేధం శనివారం నుంచి టీటీడీ అమలు చేయనున్నది..నిత్యం గోవింద నామాలతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో, గత కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులలో కొంతమంది, దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది.. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. తిరుమలకు విచ్చేసి రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతీసే ప్రసంగాలకు దూరంగా ఉండి టీటీడీకి సహకరించాలని కోరింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలియచేసింది.