ఆర్టీసీకి వెయ్యి ఈవీ బస్సులు–రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు- ముఖ్యమంత్రి
విద్యుత్ శాఖపై సమీక్షలో…
అమరావతి: ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు కీలకమైనవిగా గుర్తించి వాటికి మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుంది. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టు కింద 4,792 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వెయ్యి ఈవీ బస్సుల కొనుగోలు:- ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని సీఎం సూచించారు. త్వరలోనే వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను జెన్‌కో ఇరిగేషన్ అధికారులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద పీఎస్పీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవుతుందని అన్నారు. ఈ సమీక్షకు మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె.విజయానంద్, ట్రాన్స్ కో, జెన్కో, డిస్కమ్ సీఎండీలు హాజరయ్యారు.

