ఆమరణ దీక్షలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయి-జ‌న‌సేన‌

0
103

అమ‌రావ‌తిః కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ 29న అఖిలపక్షం చేపట్టే రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు ఇస్తుందని,పార్టీ శ్రేణులు బంద్‌లో పాలుపంచుకొంటాయని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హ‌రాల క‌మిటీ క‌న్వీన‌ర్ మాదాసు.గంగాధరం చెప్పారు.మంగ‌ళ‌వారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్,ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేస్తున్న ఆమరణ దీక్షలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయని విమర్శించారు.కేంద్రంలో అధికారం పంచుకున్నంత కాలం కడప ఉక్కు విషయాన్ని తెలుగు దేశం ప్రభుత్వం పట్టించుకోలేదని తప్పుప‌ట్టారు.ఇప్పుడు చేస్తున్న దీక్షల్లో చిత్తశుద్ధి లేదన్నారు. దీక్ష చేస్తున్నఎంపీ,ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి… ఆసుపత్రికి తరలించమంటారా? అని అడుగున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయని… ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడగలమని మాదాసు ప్రశ్నించారు.విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం జనసేన రాజీలేని పోరాటం చేస్తోందని చెప్పారు.కేంద్రం కూడా ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.కడప ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం…విశాఖ ఉక్కు కర్మాగారానికి ఐరన్ ఓర్ గనులను కూడా కేటాయించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం పట్ల బీజేపీ తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్ర 28వ తేదీన ప్రారంభమవుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పవన్ కల్యాణ్‌ను ఎంతో క‌లిచివేసింద‌న్నారు.అభివృద్ధి అంతా అమరావతిలోనే అంటూ ఉత్తరాంధ్ర,రాయలసీమ, ప్రకాశం జిల్లాలను నిర్లక్ష్యం చేస్తే జనసేన తప్పకుండా ప్రశ్నిస్తుందని… అమరావతితోపాటు అన్ని ప్రాంతాలనూ సమాన అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY