మ‌తిస్దిమిత్తం లేని పిల్ల‌ల‌ను హ‌త్య‌చేసిన మేన‌మామ

0
136

అమ‌రావ‌తిః హైదరాబాద్‌లోని చైతన్యపురి కాల‌నీలో శుక్ర‌వారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది.స్విమ్మింగ్ నేర్పిస్తానంటూ తీసుకొచ్చి మానసిక వికలాంగులైన కవల పిల్లలను సొంత మేనమామే దిండుతో ఉపిరి ఆడ‌నియ్య‌కుండా చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.వారు తెలిపిన‌ వివరాల ప్రకారం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాసరెడ్డి,లక్ష్మి దంపతులకు 12ఏళ్ల క్రితం మానసిక వికలాంగులైన సృజనరెడ్డి,విష్ణువర్థన్‌రెడ్డి జన్మించారు.వారు మాట్లాడలేరు.ఆ పిల్లలిద్దరిని స్విమ్మింగ్ నేర్పిస్తానంటూ మేనమామ మల్లికార్జున్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని చైతన్యపురిలోని తను అద్దెకుంటున్నఇంటికి తీసుకొచ్చి రాత్రి తన రూమ్‌మేట్‌ వెంకట్రామిరెడ్డి సాయంతో వారిద్దరినీ హత్య చేశాడు.అర్థరాత్రి స‌మ‌యంలో వారి మృతదేహాలను కారులో ఎక్కిస్తుండగా ఇంటి యజమాని మహేశ్‌రెడ్డి ఏమైందని ప్రశ్నించాడు.కూల్ డ్రింగ్ అనుకుని హ‌ర్పిక్‌ తాగారని, పిల్లలకు ఆరోగ్యం బాగోలేనందు వల్ల ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని కొంత తడబడుతూ చెప్పాడు.దీంతో వారి తీరుపై అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.స‌మాచారం అంద‌కున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మల్లికార్జన్‌రెడ్డి,అతడి రూమ్‌మేట్‌ వెంకట్రామిరెడ్డి,కారు డ్రైవర్‌ వివేక్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.పిల్లల మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు,ఇంటివద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఆ పిల్లల వల్ల తన అక్కా,బావలు ఇబ్బంది పడుతున్నారనే ఈ హత్యలకు పాల్పడినట్లు మల్లిఖార్జున్ రెడ్డి తెలిపాడ‌ని పోలీసు చెప్పారు. పిల్లలను హతమార్చిన తర్వాత మల్లిఖార్జున్ రెడ్డి తన బావకు ఫోన్ చేసి పిల్లలను చంపేశానని తెలియ‌చేశాడ‌న్నారు.పిల్లల హత్య సమాచారాన్ని పోలీసులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పిల్లలు మానసిక వికలాంగులు అయినప్పటికీ వారిని బాగానే చూసుకుంటున్నామని, తమకు ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా లేవని తెలిపార‌న్నారు.తమ పిల్లలను హత్య చేసినప్పటికీ మల్లికార్జున్‌రెడ్డిపై వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. తక కంటే కూడా మల్లిఖార్జున్ రెడ్డి తమ పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపేవాడని,అయితే,తమ కోసం పిల్లలను చంపానని చెప్పడం సరికాదని పిల్లల తండ్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.పోయినవారు ఎలాగూ తిరిగిరారు కాబట్టి తన తమ్ముడిని వదిలేయాలని చిన్నారుల తల్లి లక్ష్మి పోలీసులను కోరడం గమనార్హం.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని,విచారణ తర్వాత హత్యలకు సంబంధం ఉన్న ఇతర నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.

LEAVE A REPLY