ఆర్టీసీ కార్మికులు విధుల్లో వచ్చేందుకు శనివారం సాయంత్రం 6 గంటల వరకు డెడ్ లైన్

అపై మీ ఇష్టం సీ.ఎం కేసిఆర్..అమరావతి: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ యూనియన్లు పూర్తి స్థాయి సమ్మెలోకి వెళ్లడంతో,,,బస్సు సర్వీసులు ఎక్కడిక్కడ స్తభించిపోయాయి..హైదరాబాద్‌లో అయితే పేరుకైనా ఒక్క బస్సు కనబడని పరిస్థితి.సందట్లో సడేమియా అన్నట్లు ట్యాక్సీలు,ఆటోలు ప్రయాణికుల ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు.ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.శనివారం సాయంత్రం 6 గంటల లోపు సంబంధిత ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, సాయంత్రంలోపు విధుల్లో చేరని వారిని వారంతట వారు ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో కార్మికులతో చర్చల కోసం నియమించిన సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ కూడా రద్దయిపోయింది.సమ్మె విషయంలో అధికారులు చట్ట ప్రకారమే నడుచుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.శుక్రవారం రాత్రి ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎంకు ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉందనే విషయాన్ని తెలిపినప్పటికీ కార్మిక సంఘాల నాయకులు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు అధికారులు చెప్పారు.ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో, దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా వచ్చే ఆదాయం ఎంతో కొంత ఉపయోగపడుతుందని, ఈ సమయంలోనే ఆర్టీసీకి నష్టం తెచ్చే విధంగా యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడం పట్ల ముఖ్యమంత్రి తన అసహనాన్ని వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది.ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగంలోంచి తొలగించే అధికారం సంస్థకు ఉందని చెప్పారు. ఆర్టీసీ యూనియన్ నాయకుల ఉచ్చులో పడి, కార్మికులు సంస్థకు నష్టం చేయవద్దని, వారి ఉద్యోగాలు వారే పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని,కార్మికుల డిమాండ్లపై ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని సిఎం స్పష్టం చేశారు.స్వయంగా కార్మికులే ఆర్టీసీని కష్టల్లోకి నెట్టివేస్తున్నరని,ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడడం కష్టమని సీఎం అభిప్రాయపడ్డారు.

బస్సు అద్దాలు పగులకొట్టిన ఆగంతకులు:–ప్రజల సౌకర్యార్థం కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కొన్ని బస్సులను నడిపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఈ బస్పులను పోలీసుల బందోబస్తుతో నడుపుతోంది. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.వికారాబాద్ డిపోకు చెందిన బస్సు పరిగి నుంచి వికారాబాద్ కు వస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు… బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో బస్సు ముందు వైపు అద్దం పగిలింది. ప్రయాణికులకు ఎలాంటి అపాయం కలగలేదు. బస్సుతో పాటు పోలీసు ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ… మెరుపు వేగంతో దాడికి పాల్పడి వెళ్లిపోయారు. ఆర్టీసీ ఉద్యోగులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.