AGRICULTUREDISTRICTSOTHERS

ప్రతి రైతుకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు-జె.సి కార్తీక్‌

నెల్లూరు: జిల్లాలో వరి పంట కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ కె కార్తీక్‌ చెప్పారు. గురువారం ధాన్యం కొనుగోళ్లపై రైతు సంఘాల నాయకులు, రైతులతో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు పలు సమస్యలను జేసీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని విన్నవించారు. ప్రధానంగా రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించాలని, రైతుసేవా కేంద్రాల్లోనే తేమ శాతం నిర్ధారించి, ఆ ధాన్యాన్ని మిల్లర్లు తీసుకునేలా చూడాలని, లోడిరగ్‌ సమయంలో ఎక్కువసేపు వేచి వుండకుండా చూడాలని కోరారు. ధాన్యం డబ్బులను కూడా ప్రభుత్వం ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం హమాలీ, రవాణా ఖర్చులను రైతులకు చెల్లించలేదని, వెంటనే ఆ డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మిల్లర్లు, దళారులు ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేసే చర్యలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. కోతల సమయంలో గన్నీ బ్యాగులు అందుబాటులో వుంచాలని విన్నవించారు. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు మొబైల్‌ డయ్యర్లను సమకూరిస్తే రైతుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు సూచించిన అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడ్తామన్నారు. ప్రతి గింజను కూడా మద్దతు ధర కంటే తక్కువ కాకుండా కొనుగోలు చేయించడమే లక్ష్యంగా అధికారయంత్రాంగం పనిచేస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించి ధాన్యం ధరలను పర్యవేక్షిస్తారన్నారు. వ్యవసాయశాఖ, పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని చర్యలు చేపట్టామన్నారు. తేమ శాతాన్ని కూడా రైతు సేవా కేంద్రాల్లోనే నిర్ధారించి మిల్లర్లు కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. గన్నీ బ్యాగులు సరిపడ అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా మద్దతు ధరకే ధాన్యం అమ్ముకునేలా  ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, సివిల్‌ సప్లయిస్‌ డిఎం లక్ష్మీనరసింహారావు, రైతు సంఘ నాయకులు కోటిరెడ్డి,  మల్లారెడ్డి, రాధాకృష్ణమనాయుడు, శ్రీనివాసులు, వెంకటరమణయ్య, వెంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *