కొండ బిట్రగుంటలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం..
నెల్లూరు: జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలతో స్వామి, అమ్మవార్లకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రములు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ దేవాదాయ శాఖ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దేవాదాయ శాఖ మంత్రిగా మూడోసారి దర్శించుకోవడం, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా చెప్పారు. కొండ బిట్రగుంట ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, వారికి దేవాదాయ శాఖ తరపున బిట్రగుంట ఆలయ పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా అన్నివిధాల సహకారం అందిస్తామని చెప్పారు.రూ.12.50 కోట్లతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారని, అన్ని పనులు కూడా టెండర్లు పూర్తయి మొదలవుతున్నట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం, ఈవో కార్యాలయం, విశ్రాంతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. తిరుమల తరువాత దక్షిణాదిన బిట్రగుంట క్షేత్రము అత్యంత ప్రసిద్ధి చెందినదని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి చెప్పారు.2028 బ్రహ్మోత్సవాల నాటికి ఆలయంలో శాశ్వతంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.