జిల్లాలో 10 లక్షల మందితో 7000 ప్రదేశాల్లో యోగా సాధనకు ఏర్పాట్లు
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం
యోగ అంటే శరీరాన్ని మనసును ఒకటిగా నిలిపి, మనపై మనకు నియంత్రణ కల్పించి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంలను పెంపొందిస్తూ…ఉదాసీనత, ఆత్మనూన్యత, డిప్రెషన్ లను తగ్గించే అద్భుత ఆరోగ్య సాధనం….నిత్య జీవన విధానం…
నెల్లూరు: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యోగాను ప్రతిఒక్కరి జీవితంలో ఒక దినచర్యగా మార్చాలన్నదే ప్రధాన లక్ష్యంగా గత నెలరోజులపాటు జిల్లా అంతటా యోగాంధ్ర కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించారు. పర్యాటక కేంద్రాల్లో మెగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యోగా గురువులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. నేడు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో విశాఖపట్టణంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ప్రముఖులు పాల్గొంటుండగా, జిల్లాలో సుమారు 10 లక్షల మంది 7000 ప్రదేశాల్లో సామూహిక యోగాలో పాల్గొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుంది.