వైయస్ జగన్ అంటే నమ్మకం… చంద్రబాబు అంటే మోసం-సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజలకు అందుబాటులో పుస్తకం..
అమరావతి: చంద్రబాబు నేతృత్వంలో ఏడాది కిందట సరిగ్గా ఇదేరోజు ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన పాలనతో ప్రజలకు చీకటి రోజులను మిగిల్చిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏడాది పాలనతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్ఆర్‌సీపీ ప్రచురించిన పుస్తకాన్ని పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఒక అరాచకాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైయస్ జగన్ పాలన అంటే నమ్మకం గుర్తుకు వస్తే, ఇప్పుడు చంద్రబాబు కూటమి పాలనలో ప్రజలకు పొడిచిన వెన్నుపోటే గుర్తుకు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంగా వ్యవస్థల నిర్వీర్యం నుంచి ప్రజాస్వామ్య విధ్వంసం వరకు ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగిందని అన్నారు. ఏడాది కిందట ఈ రోజు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది.2019-24 మధ్య ఒంటరిగా వైయస్ఆర్‌సీపీ పోటీ చేసి 151 సీట్ల భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024లో మూడు పార్టీల కుటమితో 164 సీట్లతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.సాధారణంగానే వైయస్ జగన్ ఏడాది పాలనను, చంద్రబాబు కూటమి ఏడాది పాలనను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం:- ఏడాది పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేయడం, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు బనాయించడం, అడ్డగోలుగా అవినీతికి పాల్పడటం చేశారు. దానికి ఉదాహరణలను సవివరంగా వివరిస్తూ, ఫోటోలతో సహా వైయస్ఆర్‌సీపీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. దానిని ఈ రోజు ఆవిష్కరిస్తున్నాం. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అంటూ అయిదు కోట్ల ఏపీ ప్రజలకు ఎలా వెన్నుపోటు పొడిచారో ఈ పుస్తకం ద్వారా వెల్లడిస్తున్నాం. అన్ని ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని వెలువరించాం అని అన్నారు.