నిరుపేద‌ల సొంత ఇంటి క‌ల‌ల సాకారం-మంత్రి కాలవ

0
77

3 లక్షల సామూహిక గృహప్రవేశాలు
అమ‌రావతిః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలోని నిరుపేద‌ల సొంత ఇంటి క‌ల‌లు సాకారం అవుతున్నట్లు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ,సమాచార,పౌరసంబంధాల శాఖల మంత్రి కాలవ.శ్రీనివాసులు చెప్పారు.సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ గురువారం ఒకే రోజు రాష్ట్రంలో మూడు లక్షల మంది పేదలు తమ సొంత ఇళ్లలోకి గృహప్రవేశాలు జరిపే మహోన్నత కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొంటుదన్నారు.రాష్ట్ర చరిత్రలో ఇదొక అద్వితీయ ఘట్టంగా ఆయన పేర్కొన్నారు.ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.యూనిట్ ధరను రూ.70 వేల నుంచి లక్షా 50వేల రూపాయలకు పెంచినట్లు చెప్పారు.కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎంఏవై, ఎన్టీఆర్ గృహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.పట్టణ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.5 లక్షలు సబ్సిడీగా అందజేస్తాయని చెప్పారు.విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధి స్టేడియంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.
దీనిని రాష్ట్రంలో ఓ ఉత్సవంగా, నూత‌న గృహ‌ప్రవేశాలు చేసిన కుటుంబాల జీవితాల్లో చిర‌కాలం గుర్తుండిపోయేలా నిర్వహిస్తామన్నారు.రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలు, 9 నోటిఫైడ్ మున్సిపాలిటీల పరిధిలోని 2093 వార్డుల్లోనూ, 12,767 గ్రామ పంచాయతీల్లో మూడు లక్షల గృహప్రవేశాలను ఏకకాలంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 2 లక్షల 71 వేల ఇళ్లు, పట్టణాల్లో 24,145 ఇళ్ళను ప్రారంభించ‌నున్నామని చెప్పారు.ఒక్క నియోజకవర్గం తప్ప రాష్ట్రం నలుచెరుగులా 174 నియోజకవర్గాల్లో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.హూదూద్ తుఫాన్ బాధితులకు సంబంధించిన 5,118 ఇళ్ళు కూడా ఇదే కార్యక్రమంలో ప్రారంభిస్తామన్నారు.ఇప్పటికే రాష్ట్రంలో తొలివిడ‌త ల‌క్ష సామూహిక గృహ‌ప్రవేశాల కార్యక్రమాన్ని గ‌త ఏడాది అక్టోబ‌రు 2న విజ‌య‌వంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో ప‌ది ల‌క్షల ప‌క్కా గృహాల‌ను ఎన్టీఆర్ గృహ‌నిర్మాణ ప‌థ‌కం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాల‌ని సీఎం నిర్దేశించారని చెప్పారు.అవినీతికి తావులేని విధంగా ల‌బ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే నిధులు జ‌మ‌చేయ‌డం, ఇళ్లను జియో ట్యాగింగ్‌, ఆధార్ ద్వారా అనుసంధానించ‌డం, సిమెంటు త‌దిత‌ర ఇంటి నిర్మాణ సామాగ్రి స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లోనే ల‌బ్దిదారుల‌కు అందుబాటులో వుండేలా ఏర్పాట్లు చేయ‌డం, ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక స‌హాయాన్ని గృహ‌నిర్మాణ శాఖ ద్వారా అందించ‌డం వంటి చ‌ర్యల కార‌ణంగా ఇళ్ల నిర్మాణం వేగవంతమయినట్లు మంత్రి కాలవ చెప్పారు.

LEAVE A REPLY