గిరిజన ఆరోగ్యానికి భరోసా-ఐటీడీఏలకు 122 ఫీడర్ అంబులెన్స్‌లు

0
42

అంబులెన్స్‌లను జెండా ఉపి ప్రారంభించిన సీఎం 
అమ‌రావ‌తిః మారుమూల గిరిజన ప్రాంతవాసుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలతో కూడిన 122 ఫీడర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.వీటి ద్వారా రోడ్డు సౌకర్యంలేని,108 వాహనాలు చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లి,రోగులను సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి అవకాశం కలుగుతుంది.సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్‌లో ఫీడర్ అంబులెన్స్‌ల‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫీడర్ అంబులెన్స్ ల పనితీరును సీఎ చంద్రబాబునాయుడుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వివరించారు.అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా మన్య ప్రాంతవాసుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఫీడర్ అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రయోగాత్మకంగా పీపీపీ పద్ధతిలో 122 ఫీడర్ అంబులెన్స్ సేవలను వినియోగిస్తున్నామన్నారు. ఒక్కో వాహనం వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం రోజుకు రూ.2,100 వినియోగించనుందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
రోగి పడుకునే విధంగా ఏర్పాట్లుః-
ప్రతి ఐటీడీపీ పరిధిలో ఉన్నరెండు మూడు 108 అంబులెన్స్ లకు ఒక్కో ఫీడర్ అంబులెన్స్ వాహనం అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు.ఈ వాహన సేవలు అందుబాటులోకి రావడం ద్వారా మన్య ప్రాంతంలో ఉన్న గర్భిణులకు,పలు ప్రాణాంతక వ్యాధుల భారినపడిన రోగులకు, ప్రమాదాలకు గురైన వారికి ఎంతో లబ్ధి కలుగుతుందన్నారు.రోగిని వాహనంలో పడుకునే విధంగా బెడ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్‌ను కూడా అందులో అమర్చామన్నారు.12 రకాల వైద్య పరికరాలు,అత్యవసర మందులు కూడా వాటిలో ఏర్పాటు చేశామన్నారు.ఫీడర్ అంబులెన్స్ సేవలు విజయవంతమైతే,మిగిలిన అన్ని ప్రాంతల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలు, రోడ్డు సౌకర్యంలేని గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్ లు సులభంగా చేరుకోగలవన్నారు.
ఐటీడీఏలకు వాహన కేటాయింపులు ఇలాః-
108 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫోన్ చేసిన 60 నిమిషాల్లో సంఘటనా స్థలానికి ఫీడర్ అంబులెన్స్ చేరుకుంటుందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ అంబులెన్స్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏడు ఐటీడీలకు 122 పీడర్ అంబులెన్స్ లు కేటాయించామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. సీతంపేట ఐటీడీఏకు 15, పార్వతీపురం ఐటీడీఏకు 24, పాడేరు ఐటీడీఏకు 42, రంపచోడవరం 21, చింటూరు 6, కె.ఆర్.పురం 8, శ్రీశైలం ఐటీడీఏకు 6 ఫీడర్ అంబులెన్స్ లు కేటాయించామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య, ఆరోగ్య శాఖ సలహాదారు జితేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY