వామపక్షాలు ఆందోళన కారుల‌పై పోలీసులు లాఠీ ఛార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాం-జనసేన

0
100

క‌డ‌పః కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం వామపక్షాలు కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుండగా పోలీసుల లాఠీ చార్జీ చేయడం ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమ‌ని,ఆందోళనపై పోలీసులు లాఠీ ఛార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.ఒక కార్యకర్త చావుబతుకుల్లోకి వెళ్లడం బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు భాగమని,ఆ క్రమంలో వామ పక్షాలు కలెక్టరేట్ ముట్టడి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ‘జనసేన’ ఖండిస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం పేర్కొన్నారు. విభజన హామీల్లో భాగమైన కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని, పాలక పక్షంవారి దీక్షలకు బందోబస్తు ఇస్తున్నారని, ప్రజల గళం వినిపిస్తున్న పార్టీల గొంతు నొక్కేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ ధోరణి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, చావు బతుకుల్లో ఉన్న కార్యకర్తకు తక్షణం మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలీసులు లాఠీ ఛార్జీః-కడప ఉక్కు పరిశ్రమ సాధనకోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులపై పోలీసుల లాఠీ చార్జీ చేశారు. దీంతో యోగివేమన యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి రమేష్‌ నాయక్‌ సొమ్మసిల్లిపడిపోయాడు.అతడి పరిస్థితి విషమించడంతో సిపిఎం జిల్లా కార్యదర్శి కె. ఆంజనేయులు వెంటనే రమేష్‌ నాయక్‌ను చేతులపై ఎత్తుకుని రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపేందుకు సంసిద్ధం కాగా పోలీసులు బలవంతంగా రిమ్స్‌కు తరలించారు. వైద్యులు బాధితునికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో అతడిని తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.లాఠీచార్జీలో గాయపడిన విద్యార్థి నాయకుడు రమేష్‌ నాయక్‌ను సిపిఎం కడప జిల్లా కార్యదర్శి కారు ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణరెడ్డి పరామర్శించారు.విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాలంటే మరో 40 గంటలు పరిశీలించాలని రిమ్స్‌ వైద్యులు తెలియ‌చేసిన‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY