గవర్నమెంట్ వైద్యులు ఇకపై ప్రవేట్ వైద్యం బంద్ చేయాల్సిందే-జగన్

అమరావతి: ఏపీలో ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్న ప్రభుత్వ వైద్యులపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఇకపై ప్రైవేట్ వైద్యం చేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.దాదాపు వందకు పైగా సిఫారసులను సుజాతరావు కమిటీ చేసింది. సిఫారసుల ఆధారంగా రూ.1000 ఖర్చు దాటే ప్రతి వ్యాధికి ఆరోగ్యశ్రీలో చికిత్స అందించాలని నిర్ణయించారు. హైదరాబాద్,బెంగళూరు,చెన్నై నగరాలలోని 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు.ప్రభుత్వ వైద్యులకు జీతాలు పెంచాలన్న కమిటీ ప్రతిపాదనలకు జగన్ ఆమోదించారు.ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఆరోగ్యశ్రీ జాబితాలోకి మరిన్ని వ్యాధులను తీసుకొచ్చారు.2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు.మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయనున్నారు.ఇతర జిల్లాలలో 2020 ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అందుబాటులోకి రానుంది.డిసెంబర్ 21 నుంచి ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నారు. ఆపరేషన్లు చేయించుకునేవారు కోలుకునే వరకు నెలకు రూ.5 వేలు సాయం చేయనున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ మన విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని,వృత్తివిద్యా కోర్సు ఏదైనా చివరి ఏడాది వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండాలని,అప్రెంటిస్‌ అన్నది పాఠ్యప్రణాళికలో ఒక భాగం కావాలని పేర్కొన్నారు.చదువుకున్నదాన్ని ఏవిధంగా అమల్లో పెట్టాలన్నదానిపై పాఠ్యప్రణాళికలో ఉండాలని,ఈ అంశంపై సూచనలు చేయాల్సిందిగా నిపుణుల కమిటీని కోరారు. ప్రభుత్వాసుపత్రుల దశ,దిశ మారుస్తామని, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతలేకుండా, సదుపాయాలు కల్పించగలిగితేనే వ్యవస్థ బతుకుతుందన్నారు.రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలని, బెడ్లు, దిండ్లు, బెడ్‌షీట్లు, బాత్‌రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడా మార్చాలని, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట ఏసీలు బిగించాలని,ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రుల మీద ప్రజల దృక్పథం మారుతుందన్నారు.